ఐదు రాష్ట్రాల ఫలితాలు కాంగ్రెస్ (Congress) పార్టీకి ఒక గుణపాఠమని అన్నారు సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana). మంగళవారం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్ గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ లో కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వకపోవడం వల్లే హస్తం పార్టీ ఓడిపోయిందని చెప్పారు. ఛత్తీస్ గఢ్ లో కమ్యునిస్ట్ పార్టీకి బలం ఉందన్న ఆయన.. ఆయా రాష్ట్రాల్లో ఓటమికి కాంగ్రెస్ సంకుచిత వైఖరినే కారణమని తెలిపారు. బీజేపీ (BJP) కి వ్యతిరేకంగా ఇండియా కూటమి కలిసి ఫైట్ చేయాలన్న ఆయన.. దేశానికి ఆపార్టీ ప్రమాదమని అన్నారు.
ఐదు రాష్ట్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మారితే బాగుంటుందని సూచించారు నారాయణ. దేశంలో మోస్ట్ క్రిమినల్ గ్యాంగ్ ప్రధాని, హోంమంత్రి హోదాలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తీవ్రవాదం వల్ల దేశానికి నష్టమని విమర్శించారు. ఇక, తెలంగాణలో టూరిజం కార్యాలయంలో అగ్నిప్రమాదంపై మండిపడ్డారు నారాయణ. మంత్రి, ఎండీ కలిసి వందల కోట్ల అక్రమాలకు తేర లేపారన్నారు. ఎన్నికల ఫలితాలు రావడం కంటే ముందు రోజు టూరిజం శాఖ కార్యాలయంలో విలువైన డాక్యుమెంట్స్ కాలిపోయాయన్నారు.
హైరాబాబాద్ చుట్టుపక్కల విలువైన టూరిజం భుములను అప్పనంగా లీజుకు ఇచ్చారని.. కొత్త ప్రభుత్వం జ్యుడీషరీ విచారణ జరిగేలా చూడాలని చెప్పారు. వారిద్దరిపైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ వేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రతి అవినీతిని బయటకు తీయాలని డిమాండ్ చేశారు నారాయణ.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు తెలంగాణలో ఎటువైపు ఉంటే వారు అధికారంలోకి వస్తారని అన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ 9 సీట్లు గెలిచిందని.. నల్గొండలో 11 చోట్ల, రంగారెడ్డి, కోల్ బెల్ట్ ఏరియా, కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి పలు జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం ఉందని తెలిపారు. కాంగ్రెస్ గెలవడం భవిష్యత్తుకు సంకేతమని, ఆ పార్టీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీపీఎం స్వచ్చందంగా ఎన్నికల్లో 19 చోట్ల పోటీ చేసిందని.. మిగిలిన చోట్ల సీపీఐ, కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిందని తెలిపారు కూనంనేని.