తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళల రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు రోజు రోజుకి ఎక్కువవుతోన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా.. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా మహిళలకి రాష్ట్రమంతా ఉచిత బస్సు (Free bus) ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది.
అయితే ఈ పథకం పట్ల మొదట్లో సానుకూల స్పందనే ఉన్నా.. రోజురోజుకి బస్సుల్లో మహిళల రద్దీ పెరుగుతుండటంతో.. మహాలక్ష్మి పథకం విమర్శలపాలు అవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ స్కీమ్ అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో పెరిగిన మహిళల ప్రయాణికుల రద్దీ వల్ల.. పురుషులకు సీట్లు దొరకడం లేదని వాదన రాష్ట్రంలో బలంగా వినిపిస్తోంది. కొందరు మగవారైతే ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి..
ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి రెక్వెస్ట్ చేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేవంత్ రెడ్డి గారు.. అని సంబోధిస్తూ.. మొదలు పెట్టిన ఆ ప్రయాణికుడు.. తాను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. డబ్బులు పెట్టి టికెట్ కొనుగోలు చేసి సీట్లు లేకుండా నిలబడాలంటే తమ వల్ల కావడం లేదని, అందువల్ల మహిళలకు స్పెషల్ బస్సులు వేయండి. లేదా టికెట్ కొని ప్రయాణించే పురుషులకు సీట్లు ఏర్పాటు చేయండి అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
అయినా బస్సు ఛార్జీలు తగ్గించాలి గాని ఇలా ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే వందకి 100 శాతం మహిళలు ఉపయోగించకుండా ఉంటారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడే ఇలా ఉంటే.. పండగలప్పుడు.. పని గట్టుకొని ఆడవాళ్ళు ప్రయాణాలు చేయడం మొదలైతే బస్సులన్ని మహిళలతో నిండిపోతాయని మరో మగజాతి ఆణిముత్యం ఆవేదన చెందుతోన్నాడు.. ఇక బస్సు పాస్ ఉన్న వాళ్ళ బాధలు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..