సర్ సీవీ రామన్ (CV Raman)….సైన్స్ రంగంలో భారత్ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసిన గొప్ప శాస్త్రవేత్త. భారత్ గర్వించదగ్గ విద్యా వేత్త. కేవలం భారత్లోనే కాదు అటు ఆసియాలో సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి (Nobel Prize) పొందిన మొదటి వ్యక్తి.గా ఘనత సాధించారు. భారత్ రత్న అందుకున్న మొదటి శాస్త్రవేత్తగా ఆయన కీర్తి పొందారు.
7 నవంబర్ 1888న మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుచిరపల్లిలో జన్మించారు. పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రాఘవన్. తల్లదండ్రులు రామనాథన్ అయ్యర్, పార్వతి అమ్మాళ్. సీవీ రామన్ ప్రాథమిక విద్యను విశాఖలో, ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఫిజిక్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీని రామన్ పూర్తి చేశారు. అనంతరం ఐసీఎల్ లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ అకౌంటెంట్ గా ఉద్యోగంలో చేరారు.
ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆయన మనసు పరిశోధనల వైపు మళ్లింది. దీంతో అధికారుల నుంచి అనుమతి తీసుకుని పరిశోధనలు మొదలు పెట్టారు. చిన్ననాటి నుంచి తన తల్లి వీణ వాయించడం చూస్తు పెరిగిన కారణమో ఏమో తెలియదు కానీ మొదట సంగీత వాయిద్యాలపై పరిశోధనలు ప్రారంభించారు. ఆ తర్వాత అకౌంటెంట్ ఉద్యోగాన్ని వదిలికి కలకత్తా వర్శిటీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు.
ఆ తర్వాత కాంతిపై ప్రయోగాలు చేశాడు. ముఖ్యంగా పడవలో ప్రయాణిస్తున్న సమయంలో సముద్ర నీరు, ఆకాశం రెండు కూడా నీలి రంగులో ఉండటం గమనించారు. కాంతి అనేది సముద్రం నీటి గుండా ప్రయాణించినప్పుడు పరిక్షేపణం చెందుతుందని, అందువల్లే సముద్ర నీళ్లు మనకు నీలి రంగులో కనిపిస్తాయని చెప్పారు. ఇందులో భాగంగా రామన్ ఎఫెక్ట్ ను ఆయన ప్రచురించారు. దీనికి 1930లో ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఆ తర్వాత సైన్స్ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకు 1954లో భారత రత్న అవార్డు ప్రకటించింది.