Telugu News » Praja Bhavan : ఎట్టకేలకు ప్రజా భవన్ లో అడుగుపెట్టిన దళిత నేత..!

Praja Bhavan : ఎట్టకేలకు ప్రజా భవన్ లో అడుగుపెట్టిన దళిత నేత..!

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే, ముఖ్యమంత్రిగా దళిత నేతను ఎన్నుకుంటామని ఉద్యమం సమయంలో ప్రకటించారు కేసీఆర్ (KCR). తర్వాత తెలంగాణ కల సాకారమైంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ, కేసీఆర్ మాత్రం దళిత సీఎం వాగ్ధానాన్ని భంగం చేసి తానే ముఖ్యమంత్రి అయ్యారు.

by admin

– కేసీఆర్ కలల సౌధంలోకి దళిత నాయకుడు
– ప్రజా భవన్ లో భట్టి విక్రమార్క గృహ ప్రవేశం
– మరోసారి తెరపైకి కేసీఆర్ దళిత సీఎం హామీ
– ప్రజా భవన్ భట్టికి కేటాయించడం వెనుక ప్లానేంటి?

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ (BR Ambedkar) వంటి మహనీయుల కృషి ఫలితంగా దళితుల లోగిళ్ళలో వినూత్న కాంతులెన్నో ప్రభవించాయి. హక్కుల కోసం.. సమాజంలో వారికి న్యాయంగా దక్కాల్సిన సముచిత స్థానం కోసం.. బానిస సంకెళ్ళ విముక్తి కోసం.. ఎందరో చేపట్టిన ఉద్యమాలు, పోరాటాల పర్యవసానంగా ప్రస్తుతం వెనుకబడ్డ వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. అయితే.. ప్రత్యేక రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు పాలించిన బీఆర్ఎస్ (BRS).. దళితుల అభ్యున్నతి కోసం అది చేశాం ఇది చేశామని చెప్పుకున్నా.. సీఎం హామీని మరిచిన తీరు దళిత సమాజం మర్చిపోవడం లేదు. తాజాగా డీప్యూటీ సీఎంగా దళిత నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ అంశం తెరపైకి వచ్చింది.

dalit-leader-bhatti-vikramarka-in-praja-bhavan 1

కేసీఆర్ ఇచ్చిన హామీ ఏంటి..?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే, ముఖ్యమంత్రిగా దళిత నేతను ఎన్నుకుంటామని ఉద్యమం సమయంలో ప్రకటించారు కేసీఆర్ (KCR). తర్వాత తెలంగాణ కల సాకారమైంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ, కేసీఆర్ మాత్రం దళిత సీఎం వాగ్ధానాన్ని భంగం చేసి తానే ముఖ్యమంత్రి అయ్యారు. అదీగాక, కంటితుడుపు చర్యగా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. దీంతో దళిత సీఎం ఆశలు అడియాశలయ్యాయి. ప్రాంతీయ పార్టీల్లో తాము నిర్మించుకున్న సౌధంలో ఉన్నత స్థానంలో మరొకరిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రిని చేస్తారనేది అడియాసే. గతంలో ఇది చాలాసార్లు రుజువైంది. అయితే.. సీఎం హోదాలో కేసీఆర్ ఎంతో ముచ్చట పడి ప్రగతి భవన్ కట్టించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో అది ఖాళీ చేయాల్సి వచ్చింది. కానీ, కాంగ్రెస్ దళిత నేత భట్టి విక్రమార్క చేతికి అది చేరింది.

భట్టి చేతికి ప్రజా భవన్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ప్రగతి భవన్ కాస్తా జ్యోతిబా పూలే ప్రజా భవన్ గా మారింది. అంతేకాదు, మొన్నటిదాకా సీఎం నివాసం, క్యాంపు కార్యాలయంగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం కాంగ్రెస్ దళిత నాయకుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మారింది. ప్రజా భవన్‌ లో ప్రత్యేక పూజలు నిర్వహించి గురువారం గృహ ప్రవేశం చేశారు భట్టి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. ఈ గృహ ప్రవేశం సందర్భంగా ప్రజా భవన్‌ ను ప్రత్యేకంగా అలంకరించారు. అయితే.. దళిత సీఎం కల నెరవేరకపోయినా ఓ దళిత నాయకుడు డిప్యూటీ సీఎం హోదాలో ప్రజా భవన్ లో ఉండడంతో ఆ వర్గానికి కాస్త ఊరటనిస్తోంది.

కాంగ్రెస్ ప్లాన్ అదుర్స్

ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం ఎవరనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య తీవ్ర పోటీ ఉండగా.. దళిత సీఎం నినాదం మరోసారి వినిపించింది. అప్పుడెప్పుడో దళిత నాయకుడు దామోదరం సంజీవయ్యను సీఎం చేసింది కాంగ్రెస్. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వచ్చిందని భట్టిని సీఎం చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకురావడం కోసం కష్టపడ్డ రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి దక్కింది. డిప్యూటీ సీఎంగా భట్టిని ఎంపిక చేసింది హైకమాండ్. ఇంతవరకూ బాగానే ఉన్నా.. కేసీఆర్ కలల సౌధం భట్టికి కేటాయించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ, దీని వెనుక కాంగ్రెస్ పెద్ద ప్లానే వేసినట్టు కనిపిస్తోంది. సీఎం ఉండాల్సిన చోట దళిత నేతను ఉంచి పరోక్షంగా కేసీఆర్ హామీని పదేపదే గుర్తు చేయడం ఒకటైతే.. దళిత వర్గాలకు మరింత చేరువ కావొచ్చని హస్తం పార్టీ ఇలా చేసి ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు.

You may also like

Leave a Comment