తెలంగాణ (Telangana)లో ఎన్నికలు ముగిసే వరకు ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతరం రిజల్ట్ గురించిన ఆందోళన నేతల్లో మొదలైనట్టు కనబడుతుంది. మొత్తానికి విజయం కాంగ్రెస్.. బీఆర్ఎస్ మధ్య దాగుడు మూతలు ఆడుకుంటుందని అనుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే తన జిమ్మిక్కులతో చుక్కలు చూపించిన కేసీఆర్ తీరుకు తగిన గుణ పాఠం చెప్పాలని అధిష్టానం మనసులో మాటని ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో విజయం పై బీఆర్ఎస్ (BRS) నేతలు ఏ మాత్రం తగ్గడం లేదు.. ఎగ్జిట్ పోల్స్ అన్ని అబద్ధమని వాదిస్తున్నారు.. కాగా తాజాగా ఇదే విషయం పై బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ (Dasoju Sravan) కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ముమ్మాటికీ 70 సీట్లకు పైగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరస్తుందని అన్నారు.
తెలంగాణ ప్రజలతో కేసీఆర్ (KCR)ది పేగు బంధం అని పేర్కొన్న దాసోజ్ శ్రవణ్.. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ప్రతిపక్షాల నోటికి తాళం వేస్తారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.. ఎగ్జిట్ పోల్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు మధ్య చాలా తేడా ఉంటుందని దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. కాంగ్రెస్ (Congress) నేతలు లేకి తనం చూపిస్తున్నారని విమర్శించిన దాసోజ్ శ్రవణ్.. చిల్లర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కర్ణాటక నేతలకు తెలంగాణలో ఏం పని అని దాసోజ్ శ్రవణ్ ప్రశ్నించారు. గద్దల్లాగా తెలంగాణ పై వచ్చి పడుతున్నారని విమర్శించారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలవడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాగా బీఆర్ఎస్ మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలని చూస్తుండగా.. కాంగ్రెస్ గెలిచి తొలిసారిగా తెలంగాణలో అధికారాన్ని పొందాలని చూస్తోంది.