ఎన్డీఏ(NDA) తో కానీ బీజేపీ (BJP)తో కానీ పొత్తుపెట్టుకునే అవసరం బీఆర్ఎస్ (BRS) లేదంటూ ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో ప్రభుత్వం లో ఉన్న బీజేపీ కానీ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. మోడీ ఎన్నికల్లో గెలవడం కోసం ఏవేవో మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. హనుమకొండ జిల్లా బిఅరెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన దాస్యం వినయ్ భాస్కర్ ఈ కామెంట్స్ చేశారు.
మోడీ అవగాహనా రాహిత్యంతోనే మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అది చెప్పడంలేదన్నారు. నిజంగా తెలంగాణ పై చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు ఇప్పటి వరకూ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీ కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీయేననీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం తప్పక చెబుతారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదన్నారు.
కేటీఆర్ ఈ నెల ఆరో తేదీన వరంగల్ లో పర్యటించనున్నారనీ ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారనీ దాస్యం తెలిపారు. సుమారు రూ.900 కోట్లు విలువచేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. పదివేల దుస్తులను ఒకేసారి ఇస్త్రీ చేసే లాండ్రీ మార్ట్ ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. వరంగల్ నగరాన్ని టెంపుల్ టూరిజం నగరంగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు.
వీటితోపాటు వరదల నివారణకు రూ.250 కోట్లతో వివిధ రకాల పనులు చేపట్టనున్నామని చెప్పారు. అంతేకాకుండా రూ.70 కోట్ల వ్యయంతో మోడ్రన్ బస్ స్టేషన్ కూడా నిర్మించనున్నామని చెప్పారు. కుడా గ్రౌండ్ లో భహిరంగ సభ అనంతరం కేటీఆర్ తూర్పు నియోజక వర్గంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.