టాటా గ్రూప్ (TATA Group) విమానయాన రంగంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. కొంతకాలంగా ప్రభుత్వం కింద ఉన్న ఎయిరిండియాను అత్యధిక బిడ్‌కు గతంలో తిరిగి దక్కించుకొన్న సంస్థ.. విలీన ప్రక్రియ కోసం సంవత్సరం పైగా ఎదురు చూస్తోంది. కాగా ప్రస్తుతం టాటా గ్రూప్‌కు ఎయిరిండియా, ఎయిర్ ఏషియా (Air Asia), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా ఎయిర్‌లైన్స్ మొదలగు ఈ నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి.
అయితే వీటన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చే ప్లాన్ లో ఉందని సమాచారం.. మరోవైపు ఇదే గ్రూప్‌కు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ (Vistara Airlines) లో సంక్షోభం మొదలై క్రమక్రమంగా ముదురుతోంది. ఈ క్రమంలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో నిన్న 50కి పైగా విమానాలను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము పడిన ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.
దీంతో స్పందించిన కేంద్ర పౌర విమానయాన సంస్థ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోంది. అయితే విస్తారాలో దాదాపు 800 మంది పైలట్లు ఉన్నారు. వీరిలో ఇటీవల 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా చేశారు. అందువల్ల ప్రస్తుతం పైలట్ల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు, విమాన సర్వీసులు జాప్యం, రద్దుకు సంబంధించిన వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకొంది.
విమానాల జాప్యం, రద్దు సమాచారంతో పాటు, ఇతరత్రా వివరాలపై రోజువారీ నివేదికను సమర్పించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)
విస్తారాను ఆదేశించింది. ఇక ఎయిర్ ఇండియాలో విలీనం దిశగా అడుగులు వేస్తున్న విస్తారా వేసవి నేపథ్యంలో రోజుకు 300కు పైగా విమానాలు కొనసాగిస్తుంది. కాగా వేతనాల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ సీనియర్ పైలట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 15 మంది రాజీనామా చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం..