దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగిపోతోంది. వరుసగా మూడవ రోజు కూడా వాయు నాణ్యత సూచీ (AQI)ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు సఫర్ తెలిపింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 413గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.
ఆనంద్ విహార్ ప్రాంతంలో నిన్న రాత్రి వాయు నాణ్యత సూచీ 999కు చేరుకుంది. ఈ క్రమంలో అనంద్ విహార్ బస్ టెర్మినల్ వద్ద ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తనిఖీలు చేపట్టారు. యూపీ నుంచి వస్తున్న బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందన్నారు.
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు తమ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని మంత్రి వెల్లడించారు. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఇక్కడ తనిఖీలు చేశానన్నారు. అక్కడ వస్తున్న బస్సులన్నీ బీఎస్-3, బీఎస్-4 రకానికి చెందినవన్నారు. ఆ బస్సులన్నీ యూపీ నుంచి వస్తున్నట్టు గుర్తించామన్నారు.
బీఎస్-3, బీఎస్-4 బస్సులను ఢిల్లీకి పంపించవద్దని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను కోరుతున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ఎక్కువగా ఎలక్ట్రికల్ బస్సులు, సీఎన్జీ బస్సులను నడుపుతున్నామన్నారు. నిషేధించిన బస్సులను ఢిల్లీలోకి అనుమతిస్తున్నారంటూ ట్రాఫిక్ పోలీసులు పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.