ఐపీఎల్ 2024(IPL-2024) లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు 67పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant) మాట్లాడుతూ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపాడు. టాస్ విషయంలో తాను పొరపాటు చేశానని అన్నాడు.
మంచు ప్రభావం ఉంటుందని భావించి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడమే తమ ఓటమికి కారణమని చెప్పాడు. పవర్ ప్లేనే ఎస్ఆర్హెచ్ విజయానికి కారణమని తెలిపాడు. అయితే తర్వాతి మ్యాచ్లో మాత్రం అలాంటి తప్పిదం చేయమని తెలిపాడు. ఈసారి స్పష్టమైన ప్రణాళికతో మైదానంలోకి అడుగుపెడతామని వెల్లడించాడు. పవర్ ప్లేలో సన్రైజర్స్ 125 పరుగులు చేసింది.
అయితే, ఎస్ఆర్హెచ్ 220-230 పరుగులకు కట్టడి చేస్తే గెలిచే అవకాశం ఉండేదని, పవర్ ప్లేనే ఇద్దరి మధ్య తేడా అని రిషబ్ పంత్ తెలిపాడు. మంచు ప్రభావం ఉంటుందని తాము భావించామని, అయితే మ్యాచ్లో ఏమాత్రం మంచు రాలేదని తెలిపాడు. తాము ఊహించినదాని కంటే పిచ్ స్లో అయ్యిందని, ఆరంభం దక్కినా ఆ తర్వాత వికెట్స్ కోల్పోయామన్నాడు.
‘పవర్ ప్లేనే మా ఓటమి కారణం. టోర్నీలో మేం మరింత స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. జేక్ ఫ్రేజర్-మెర్క్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. జట్టుకు తగినట్లుగానే అతడు తన ఆటతీరును కనబరిచాడు. విజయం సాధించాలంటే ఒక్కరు మాత్రమే ఆడితే సరిపోదు. అందరూ బాగా ఆడినప్పుడే విజయం వరిస్తుంది. ఇకపై ఆ తప్పిదం జరగకుండా జాగ్రత్త పడతాం’ అని రిషబ్ పంత్ తెలిపాడు.