రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రుల చర్చలు సత్పలితాలను ఇస్తున్నాయి. రైతుల (Farmers) ప్రధాన డిమాండ్ అయిన మద్దతు ధర (Minimum Support Price) విషయంలో కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతి పాదనల నేపథ్యంలో తాము ఛలో ఢిల్లీని రెండు రోజుల పాటు వాయిదా వేస్తున్నామని రైతులు ప్రకటించారు. దీంతో రైతులకు ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
అంతకు ముందు రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయెల్, నిత్యానంద్ రాయ్ భేటీ అయ్యారు. వారితో పాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. రాబోయే ఐదేండ్ల పాటు పలు రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు.
పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయని ప్రతిపాదనలు చేశాయి. ఈ ప్రతిపాదనలకు రైతు సంఘాలు సంతృప్తి వ్యక్తం చేయడంతో చర్చలు సఫలం అయ్యాయి. ఈ మేరకు విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. చర్చల అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మీడియాతో మాట్లాడారు.
నాలుగో రౌండ్ చర్చల్లో రైతుల ముందుకు తాము వినూత్న ప్రతిపాదన తీసుకు వచ్చామని తెలిపారు. రైతుల నుంచి ఎన్సీసీఫ్, ఎన్ఏఎఫ్ఈడీ, సీసీఐ లాంటి సహకార సంస్థలు ఒప్పందం కుదుర్చుకుంటాయని ప్రతిపాదనలు తీసుకు వచ్చామని చెప్పారు. ఆయా సంస్థలు రాబోయే ఐదేండ్లపాటు వారి పంటలను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తాయని అన్నారు.
రైతులతో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. రైతులు చేస్తున్న పలు డిమాండ్లపై సమగ్ర చర్చ లేకుండా నిర్ణయం తీసుకోలేమని వివరించారు. రైతులు ఉత్పత్తి చేసిన పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు ఉండబోవని రైతులకు చెప్పామని పేర్కొన్నారు. కొనుగోళ్ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ నిర్ణయం పంజాబ్ వ్యవసాయాన్ని కాపాడుతుందన్నారు.
మరోవైపు నాలుగో రౌండ్ చర్చల్లో ఎంఎస్‌పీ చట్టం, ఎం.ఎల్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, రుణమాఫీ వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించామని రైతు సంఘాల నాయకులు వివరించారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంకా కొన్ని డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయని.. మరో రెండు రోజుల్లో అవి కూడా పరిష్కారం అవుతాయని తాము ఆశిస్తున్నట్టు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.