బిహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్( RJD)అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. భూములకు బదులుగా ఉద్యోగాలు ( Jobs For Land)కేసులో లాలూతో పాటు ఆయన సతీమణి రబ్రీ దేవీ, ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు ఢిల్లీ కోర్టు సమన్లు (Summons) పంపింది.
ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను న్యాయమూర్తి జస్టిస్ గీతాంజలి గోయెల్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు అక్టోబర్-4న తమ ముందు హాజరు కావాలని లాలూతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆదేశించారు. ఈ కేసులో లాలూను ప్రాసిక్యూట్ చేసేందుకు హోం మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించిందని సీబీఐ ఇటీవల కోర్టుకు తెలిపింది.
ఈ కేసులో లాలూను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే మహీప్ కపూర్, మనోజ పాండే, పీఎల్ బంకర్ లను విచారించేందుకు ఇప్పటికే అనుమతులు వచ్చాయని తెలిపారు. ఈ కేసులో మరో 14 మంది పేర్లను సీబీఐ తన ఛార్జ్ షీట్ లో చేర్చింది. తాజాగా వారికి కూడా న్యాయమూర్తి సమన్లు పంపారు.
యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా లాలూ పని చేసిన సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం జరిగినట్టు సీబీఐ అధికారులు పేర్కొంటున్నారు. 2004 నుంచి 2009లె రైల్వేని వివిధ జోన్లలో గ్రూప్ డీ పోస్టుల్లో అనేక మందిని నియమించగా పలువురిని నియమించగా, దానికి బదులుగా వారంతా తమ భూములను లాలూ కుటుంబ సభ్యులకు, బినామీలకు బదిలీ చేశారని సీబీఐ అభియోగాలు మోపింది.