ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో ప్రధాన నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయినపల్లికి కాస్త ఊరట లభించింది. తన భార్య అనారోగ్యం బారిన పడిన కారణంగా బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు పరిశీలించి, ఐదువారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాస్ పోర్టును సరెండర్ చేసి, హైదరాబాద్ (Hyderabad)లో చికిత్స చేయించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
అయితే ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేశాక ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఈడి అధికారులకు ఫోన్ నంబర్ ఇవ్వాలని, సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అభిషేక్ బోయినపల్లి (Abhishek Boinapally)ని ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో 19 నెలలుగా జైలులో ఉంటున్న అభిషేక్ బోయినపల్లి 2022 నవంబర్ 13వ తేదీన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
కాగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అభిషేక్ బోయినపల్లి తో పాటు అరుణ్ రామచంద్ర పిళ్ళై, రాబిన్ డిస్టిలరీస్ కు డైరెక్టర్లుగా ఉన్నారు. 2022 జూన్ లో రాబిన్ డిస్టిలరీస్ ను ఏర్పాటు చేసి.. హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో నమోదు చేశారు. ఈ సమయంలోనే మధ్యం కేసు తెరపైకి వచ్చింది. ఇదిలా ఉండగా అభిషేక్ అరెస్ట్ తర్వాత.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ దే కీలక పాత్ర అని సీబీఐ తేల్చింది. సౌతాలాభి పేరుతో అభిషేక్ లావాదేవీలు కొనసాగించినట్లు గుర్తించింది. ఈ ఘటన జరిగిన అనంతరం ఈ కేసులో ఎన్నో ట్విస్ట్ లు చోటు చేసుకొన్నాయి.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. తర్వాత శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, దినేశ్ అరోరా సైతం చిక్కారు. కాగా తాజాగా వీరంతా అప్రూవర్లుగా మారడంతో కవిత అరెస్ట్ అనివార్యమైంది. ప్రస్తుతం ఈడీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందని టాక్ వినిపిస్తోంది.