రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించిన ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసు.. చివరకు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌తో కొత్త రాగం అందుకొందని అంటున్నారు.. నీతులు చెప్పడానికే రాజకీయాలు.. ఆచరించడానికి కావని కవిత నిరూపించినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ నేతలు కొందరు మాత్రం ఈమె అరెస్ట్ ఖండిస్తున్నారు.. కానీ కేసీఆర్ (KCR) మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడం చర్చాంశనీయంగా మారింది.
మరోవైపు కవిత అరెస్ట్ పై, బీఆర్ఎస్ (BRS) రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) స్పందించారు.. గత రెండేళ్లు సీరియల్స్ సాగదీసినట్లు ఈ కేస్‌ను కూడా అలాగే చేసి.. ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కవిత బాధితురాలే కానీ నిందితురాలు కాదని పేర్కొన్నారు..
లిక్కర్ స్కామ్ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా ఈడీ (ED) కవితను అరెస్టు చేసిందని ఆరోపించారు. అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు 200 ఈడీ కేస్లు ఉంటే.. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2024 వరకు.. 2954 పై చిలుకు కేసులు నమోదయ్యాయని, ఇదంతా కేవలం పది సంవత్సరాలలో జరిగిందని తెలిపారు. ఎన్నికల టైంలో ప్రత్యర్థులను వేధించడానికి బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్యాయంగా నిందలు మోస్తున్న కవిత.. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వద్దిరాజు రవిచంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారని విమర్శించిన ఆయన.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పునర్వైభవం పొందుతుందని జోస్యం చెప్పారు..