ఢిల్లీ (Delhi)లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం కారణంగా నేటి ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. ఘజియాబాద్ (Ghaziabad), నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ (Gurugram) సహా ఎన్సీఆర్ (NCR) ప్రాంతాల్లో ఎడతెగని వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకస్మిక వాతావరణ మార్పుతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
మరోవైపు పలు చోట్ల గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తున్నట్లు ఢిల్లీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం ఢిల్లీ-ఎన్సీఆర్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో వాతావరణం చల్లగా మారనుందని తెలిపారు. ఇక మార్చి 2న పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మెరుపులు, బలమైన గాలులతో పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించింది.
మరోవైపు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో పంజాబ్, హర్యానాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్చి 2న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర మధ్య ప్రదేశ్లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో ఆఫీస్లు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొన్ని రోజులు భానుడి ప్రతాపంతో వేడెక్కిన దేశ రాజధాని.. ఆకస్మిక వర్షాలతో కాస్త చల్లబడింది.