ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ (ABVP) సత్తా చాటింది. మొత్తం నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్లో మూడు కీలకమైన పోస్టులను దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ (Congress) అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ (NSUI) ఒక్క పోస్టును మాత్రమే గెలుచుకోగలిగింది.
ఢిల్లీ వర్శిటీ అధ్యక్షుని పోస్టుకు నిర్వహించిన ఎన్నికల్లో ఏబీవీపీ నేత తుషార్ దేదా విజయం సాధించారు. ఎన్ఎస్ యూఐ అభ్యర్థి హితేశ్ గులియాపై ఆయన గెలుపొందారు. ఇక స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా ఏబీవీపీ అభ్యర్థి అపరాజిత ఎన్నికయ్యారు. వర్శిటీ స్టూడెంట్ యూనియన్ జాయింట్ సెక్రటరీగా సచిన్ బైంస్లాను విద్యార్థులు ఎన్నుకున్నారు.
స్టూడెంట్ యూనియన్ ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. 24 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, ప్రధాన పోటీ మాత్రం ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీల మధ్య జరిగింది. మొత్తం 52 కాలేజీల్లో, పలు డిపార్ట్ మెంట్లలో ఈ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించారు. అదే సమయంలో కాలేజీ యూనియన్ ఎన్నికలను మాత్రం బ్యాలెట్ ద్వారా జరిపారు.
ఈ ఎన్నికల్లో వర్శిటీలో 42 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. వర్శిటీలో సుమారు లక్ష మందికి ఓటు హక్కు వున్నట్టు చెప్పారు. అంతకు ముందు 2019లో ఢిల్లీ వర్శిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏబీవీపీ నాలుగు పోస్టులకు గాను మూడు కైవసం చేసుకుంది.