ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ(AP) రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. సీఎం జగన్(CM Jagan) ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ ప్రకటన చేస్తారోనని నేతలతో పాటు ప్రజల్లో గుబులు పట్టుకుంది. ఈ క్రమంలో కొంతమంది తమకే టికెట్ అంటూ ధీమాతో ఉండగా మరికొంతమంది సీనియర్లు మాత్రం ఈసారి పోటీకి దూరంగా ఉంటామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasadrao) కీలక ప్రకటన చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని అన్నారు. అంతర్గత చర్చలు ఎలా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీపై మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మంత్రి ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశా.. 33 ఏళ్లకే మంత్రిని అయ్యాను. ప్రజలు ఏమి కోరుకుంటే అదే చేస్తా.. ప్రజలు వద్దనుకుంటే పోటీ చేయను.. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటా.. ఈ విషయాన్ని సీఎం జగన్తో చెప్పా.. పార్టీ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటానన్నా.. కానీ ఆయన ఒప్పుకోవడంలేదు.. పార్టీ కోసం తప్పకుండా పనిచేయాలని కోరారు..’ అని తెలిపారు.
అదేవిధంగా రాజకీయాల్లో విసిగిపోయానన్నారు. మీకు నచ్చితే పోటీ చేస్తా.. లేకపోతే తప్పుకుంటానని చుప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీపై ధర్మాన అభిప్రాయంపై వైసీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు పోటీకి సంబంధించి ధర్మాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.