లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పసుపు రైతులను కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం తప్పుదోవ పట్టింస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు పసుపు బోర్డుపై రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
నిజామాబాద్లో మీడియాతో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ….రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారి పోతోందని అన్నారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పసుపు రైతులను ముంచింది ఇదే కాంగ్రెస్ పార్టీ అని ఫైర్ అయ్యారు. పసుపు రైతులకు అధోగతి పట్టించింది ఆ పార్టీయేనని ఎంపీ నిప్పులు చెరిగారు.రాష్ట్రంలో ఉన్న చెక్కెర కర్మాగారాలను నిర్ధాక్షిణ్యంగా మూసి వేయించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో చెక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని గొప్పలు చెప్పారని అన్నారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కమిటీల పేరుతో ఆ పార్టీ కాలాయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవ సాయ శాఖ మంత్రిగా తుమ్మల ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అని తీవ్రంగా విరుచుకు పడ్డారు.
తుమ్మలకు పసుపు పంటపై అవగాహన లేదని దుయ్యాబట్టారు. పసుపు విస్తీర్ణం తగ్గిందని మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు పై కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మానుకుని.. రైతులకు మేలు చేసే పనులు చేయాలన్నారు.