మిస్టర్ కూల్, చెన్నయ్ సూపర్ కింగ్స్(Chennai super kings) జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni)పై సన్ రైజర్స్ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిన్న(శుక్రవారం) లక్నో సూపర్ జాయంట్స్తో జరిగిన మ్యాచులో ధోని కేవలం 9 బంతుల్లోనే 28 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.
తాజాగా దీనిపై సన్ రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ( Ex Sunrisers Coach Tom moodi) స్పందించారు. ‘42 ఏళ్ల వయసులో, అసలు ఏడాది మొత్తం క్రికెట్ ప్రాక్టీస్ లేకుండానే సరాసరి గ్రౌండ్లో దిగి అలా ఆడటం మాములు విషయం కాదు. ఆయనకు ఇంకా పరుగుల ఆకలి తగ్గలేదు. చాలా ఫిట్‌గా ఉన్నారు. ఆటపై మక్కువతో కనిపిస్తున్నారు’ అని మూడీ అభిప్రాయపడ్డారు.
అంతకముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులోనూ ధోని చివరి ఓవర్లో బ్యాటింగ్ వచ్చి ఐదు బంతుల్లో 20 పరుగులు రాబట్టారు. చివరి మూడు బంతుల్లో 3 సిక్సులు రాబట్టి స్కోరు బోర్డును 200 వద్ద నిలిపారు. ఇకపోతే ఐపీఎల్ 2024 సీజన్లో ధోని తన కెప్టెన్సీ నుంచి స్వతంత్రంగా తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఈ సీజన్ తర్వాత ధోని చెన్నయ్ జట్టుకు వీడ్కోలు చెబుతారని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.ఆటగాడిగా క్రికెట్ నుంచి తప్పుకుని చెన్నయ్ జట్టుకు మెంటర్‌గా ధోని వ్యవహరిస్తారని టాక్ వినిపిస్తోంది.ఇదిలాఉండగా ధోని అభిమానులు, చెన్నయ్ మేనెజ్మెంట్ మాత్రం ఆయన మరిన్ని సీజన్స్ ఆడాలని కోరుకుంటున్నారు.