ప్రధాని మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి (Mithun Reddy) తెలిపారు. పాలక ఎన్డీయే కూటమికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందని, అలాంటప్పుడు అవిశ్వాసం ఎందుకన్నారు. మణిపూర్ లో జరిగిన హింసాత్మక ఘటనలు బాధాకరమని, వీలైనంత త్వరగా ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్థర్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఈ అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతునిస్తున్నట్టు భారత్ రాష్ట్ర సమితి (BRS) ప్రకటించింది.
చర్చలో భాగంగా ఈ పార్టీ నేత నామా నాగేశ్వర రావు..(Nama Nageswara Rao) కేంద్రంపై విరుచుకపడ్డారు. విభజన చట్టంలో ఎన్నో హామీలిచ్చారని, కానీ తెలంగాణ (Telangana) విషయంలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పడే నాటికి తాగడానికి, వ్యవసాయానికి నీళ్లు లేవని, కానీ తాము భగీరథ మిషన్ ను తెచ్చామన్నారు. దీన్నే కేంద్రం కాపీ చేసి హర్ ఘర్ జల్ అంటోందన్నారు. అన్ని రాష్ట్రాలకు నిధులిస్తారు గానీ మిషన్ భగీరథకు మాత్రం కేంద్రం నుంచి నిధులు అందలేదన్నారు. దీనికి నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని, కానీ కేంద్రం మొండి చెయ్యి చూపిందని అన్నారు. ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని ఆయన చెప్పారు,. మేం ఎన్డీయే కాదు.. అలా అని ఇండియా కూటమి కూడా కాదు అని చెప్పిన నామా నాగేశ్వర రావు.. మణిపూర్ కు అఖిల పక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని కోరుతున్నామన్నారు.
ప్రధాని వచ్చి ఎందుకు మాట్లాడరు ?
మణిపూర్ లో ఘోరమైన హింసాత్మక ఘటనలు జరిగినా ప్రధాని మోడీ సభకు వచ్చి ఎందుకు మాట్లాడరని కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి (Revant Reddy) ప్రశ్నించారు. ఈ రోజు ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవమని, ఈ సందర్భంగా వారిపై గౌరవంతో మోడీ ఇక్కడకు వచ్చి.. ముఖ్యంగా మణిపూర్ లో జరిగిన అఘాయిత్యాలకు క్షమాపణ చెప్పి ఉంటే ఆయనపట్ల ప్రజలకు గౌరవం ఎంతో పెరిగి ఉండేదన్నారు. ఎన్డీఎ అంటే నేషన్ డివైడ్ అలయెన్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజనులు, ఆదివాసీలంటే ఈ ప్రధానికి చులకన అని ఆరోపించిన ఆయన. తమ పార్టీ తరఫున అవిశ్వాస తీర్మానాన్ని సమర్థిస్తున్నామని చెప్పారు. మోడీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని పేర్కొన్నారు. విభజించు-పాలించు అన్న బ్రిటిష్ విధానాన్ని ఈ సర్కార్ పాటిస్తోందని,, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
రాజ్యసభలో విపక్షాల వాకౌట్
మణిపూర్ అంశంపై 267 నిబంధన కింద చర్చ చేబట్టాలన్న తమ డిమాండును చైర్మన్ జగదీప్ ధన్కర్ నిరాకరించినందుకు నిరసనగా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే ఆధ్వర్యాన విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. మాట్లాడేందుకు తమను అనుమతించడం లేదని, సభకు వచ్చేందుకు ప్రధాని మోడీ కూడా సిద్ధంగా లేరని ఖర్గే ఆరోపించారు.