పైసా పైసా నువ్వేం చేస్తావని అడిగితే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతా.. కటుంబ సభ్యుల మధ్య బంధం చెడగొడతా.. ప్రాణాలు ప్రమాదంలో పడేస్తా.. మొత్తానికి మనిషికి నిమ్మలం లేకుండా చేస్తా అందని పెద్దలు అంటారు.. నేటి కాలంలో పరిస్థితి ఇలాగే ఉంది. మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారిపోయాయి. ఆస్తుల కోసం కన్నవారు, తోబుట్టువులు అని కూడా చూడటం లేదు. ఇప్పుడు మనం చదవబోయే మ్యాటర్ కూడా అలాంటిదే. ఆస్తికోసం సొంత కుటుంబ సభ్యులే ప్రాణాలు తీసిన ఘటన మేడ్చల్ (Medchal)లో జరిగింది.. రాజ బొల్లారం ( Raja Bollaram), అక్బర్ జాపేట్ ( Akbar Japet)లో ఓ RMP డాక్టర్ ను సొంత బామ్మర్దులు దారుణంగా హత్య (Murder) చేసిన ఘటన కలకలం రేపుతుంది.
స్థానికంగా RMP డాక్టర్ (Doctor) పని చేస్తూ జీవిస్తున్న గౌస్ అనే వ్యక్తి ని సొంత కుటుంబ సభ్యులు హత్య చేశారు. శామీర్ పేట్ లో నివాసం ఉండే సొంత బామ్మర్దులు బుధవారం అర్ధరాత్రి గౌస్ ఇంటికి భూ వివాదం విషయం పై మాట్లాడుకుందామని వచ్చారు. ఈ క్రమంలో మాట మాట పెరిగి ఒక్క సారి అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీంతో కోపోద్రిక్తులైన గౌస్ బామ్మర్దులు కర్రలతో గౌస్ పై దాడికి దిగారు. వారి వెంట తెచ్చుకున్న కత్తితో గౌస్ ని విచక్షణ రహితంగా పొడవడంతో అక్కడికక్కడే గౌస్ ప్రాణాలు వదిలినట్టు సమాచారం.
అయితే జరుగుతున్న గొడవని గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. వారు గౌస్ ని దగ్గర్లో ఉన్న మెడిసిటీ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే గౌస్ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కాగా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. మరోవైపు ఈ హత్యకు పాల్పడింది సయ్యద్ లతీఫ్, మెహర్ ఉన్నిసా, సయ్యద్ అల్తాఫ్, హసీనా బేగం, సయ్యద్ ముబీన్ గా పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు మేడ్చల్ సీఐ నరసింహారెడ్డి తెలిపారు. గౌస్ హత్యకు గల కారణం భూ వివాదమేనా.. ఇంకా ఏమైనా కక్ష సాధింపు చర్యలు వున్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.