తమిళనాడు (Tamilnadu) సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని తొలగించవద్దని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను స్టాలిన్ కోరారు. గవర్నర్ విమర్శల వల్ల తమ పార్టీకి బలం చేకూరుతోందన్నారు.
రాజ్ భవన్ ఎదుట పెట్రోల్ బాంబు దాడి ఘటనపై డీఎంకే సర్కార్ పై గవర్నర్ ఆర్ఎన్ రవి విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో స్టాలిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఓ వివాహ వేడుకలో ఆయన మాట్లాడుతూ… గవర్నర్ ఆర్ఎన్ రవి తమ పార్టీకి సమాంతరంగా ప్రచారం చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గవర్నర్ ప్రచారం తమ పార్టీకి పరోక్షంగా బలం చేకూరుస్తోందని చెప్పారు. అందువల్ల గవర్నర్ ను 2024 ఎన్నికల వరకు మార్చవద్దని కేంద్రాన్ని ఆయన కోరారు. గవర్నర్ వ్యాఖ్యలను ప్రజలెవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని వెల్లడించారు. గవర్నర్ వ్యాఖ్యలకు ఎవరూ అంత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పారు.
రాష్ట్రంలో పరిపాలనా సంబంధమైన విషయాల్లో గత కొన్ని నెలలుగా సర్కార్ వర్సెస్ గవర్నర్ ఎపిసోడ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆర్ఎన్ రవిని బీజేపీకి వర్కింగ్ ఏజెంట్ గా డీఎంకే అభివర్ణిస్తోంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న ప్రాంతాల్లో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం కలిగించేందుకు గవర్నర్ ను ఓ సాధనంగా వాడుకుంటోందని డీఎంకే ఆరోపిస్తోంది.