ఐపీఎల్(IPL)లో బెంగళూరు జట్టు(RCB) వరుస ఓటములతో సతమతమవుతోంది. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం హైదరాబాద్ జట్టు(SRH)తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి హైదరాబాద్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది ఎస్ఆర్హెచ్. ట్రావిస్ హెడ్ (102) శతకం సాధించాడు.
క్లాసెన్ (67), సమద్ (37), అభిషేక్ శర్మ (34) మార్ క్రమ్ (32నాటౌట్) కూడా రాణించారు. అనంతరం బెంగళూరు 20ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. డుప్లెసిస్ (62), కోహ్లి (42) మెరుపు ఆరంభాన్నిచ్చినా ఆ తర్వాత ఆ జట్టు గాడి తప్పింది. దినేశ్ కార్తీక్ (83) సంచలన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి గౌరవప్రదమైన ఓటమిని మిగిల్చాడు. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. తమ జట్టు ఓటమికి గల కారణాలను వివరించాడు.
వరుస వైఫల్యాలతో తమ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయిందని తెలిపాడు. ఎస్ఆర్హెచ్ ఈ పిచ్‌పై నమోదు చేసిన స్కోర్లు ఓ ప్రపంచ రికార్డు అని తెలిపాడు. అయితే తాము చేసిన స్కోర్ కూడా తక్కువేం కాదని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టమని తెలిపాడు. తామ శాయశక్తులా ప్రయత్నించినా ఫలించలేదన్నాడు. విజయం ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం నింపుతుందని, దాంతో వరుస విజయాలు సాధ్యమవుతాయని చెప్పాడు.
ఆత్మవిశ్వాసం లేకుండా ఆడితే ప్రతిఫలం ఉండదని అభిప్రాయపడ్డాడు. తమ బౌలర్లు చాలా కష్టపడ్డారని, బ్యాటింగ్ విషయంలోనూ కొన్ని మార్పులు చేసుకుని ఉంటే పవర్‌ప్లే తర్వాత రన్ రేట్ తగ్గేది కాదేమోనని తెలిపాడు. తమ బ్యాటర్లు తమ వంతు కృషి చేశారని, ఎక్కడా చేతులెత్తేయలేదన్నాడు. క్రికెట్లో ముఖ్యంగా ఒత్తిడి లేకుండా కమిట్మెంట్తో ఆడాల్సి ఉంటుందని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో తమ ప్లేయర్లు ఒత్తడికి గురైన విషయాన్ని డుప్లెసిస్ అంగీకరించాడు.