ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇప్పటికే భారత్ పై భూకంపాలు.. వరదలు దాడిచేస్తుండగా.. విదేశాలను సైతం భూకంపాలు, వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మానవ తప్పిదాలా లేక మరేదైనా కారణాలా అనేది పక్కన పెడితే.. మానవ జీవన విధానం మాత్రం ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంది.
మరోవైపు ఆగ్నేయ ఆసియా (Southeast Asia) దేశం ఫిలిప్పీన్స్ (Philippines) వరస భూకంపాలతో అల్లాడిపోతుంది. గత రెండు మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో ఫిలిప్పీన్స్ ప్రజలు భయాందోళనతో ఉన్నారు. తాజాగా దేశంలోని లుజోన్‌లో మంగళవారం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా భూకంపం కారణంగా రాజధాని మనీలా (Manila)లోని భవనాలను ప్రజలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా సంభవించిన భూకంపం.. భూమి అంతర్భాగంలో 79 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు ఫిలిప్పీన్స్ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాజధానిలోని సెనెట్, అధ్యక్ష భవనం, న్యాయమంత్రిత్వ శాఖ భవనాలను ఉద్యోగులు ఖాళీ చేశారు. విద్యార్థులు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వచ్చారు. ఈ భూకంపం కంటే ముందు శనివారం 6.2 తీవ్రతతో భూమి కంపించింది.
మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‌లో ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండటంతో పాటు భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలిక కూడా ఎక్కువగా ఉంటోంది. దీని కారణంగా ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు (Earthquake) సంభవిస్తుంటాయి. సునామీల ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు..