తూర్పు ఆసియాలోని తైవాన్(Taiwan) దేశం వరుస భూకంపాలతో వణుకుతోంది. సోమవారం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు(Earthquakes) సంభవించినట్లు తైవాన్ వాతావరణ శాఖ పేర్కొంది. తైవాన్ తూర్పు తీరంలో అత్యధికంగా రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది.
భూకంపాలకు అధిక అవకాశం ఉండే రెండు ‘టెక్టోనిక్ ప్లేట్స్'(Tectonic plates) జంక్షన్‌కు సమీపంలో తైవాన్ ఉంది. అందుకే, ఆ దేశంలో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. తాజాగా వచ్చిన భూకంప ప్రభావంతో తైవాన్ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బ తిన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్‌లో ఎక్కువ భూకంపాలు సంభవించినట్లు గుర్తించారు.
అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 3వ తేదీన తైవాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం విధితమే. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి తైవాన్‌లో వరుస భూప్రకంపనలు వస్తున్నాయి. ఏప్రిల్ 3వ తేదీన ఏర్పడిన భూకంపంతో హువాలియన్‌లో కొద్దిగా వంగిన ఓ హోటల్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా వచ్చిన భూకంప ధాటికి ఆ భవనం పూర్తిగా ధ్వంసమైంది. భవనంలో ఉన్నవారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అగ్నిమాపక విభాగం మంగళవారం తెల్లవారుజామున సహాయక చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు భూకంపానికి సంబంధించిన సందేశాలను పంపిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు అప్రమత్తమై ప్రాణాలను కాపాడుకుంటున్నారు.