భూ సమస్యలపై శాస్త్రీయ అధ్యయనం జరగాల్సిన అవసరం వుందన్నారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. రేపటి తెలంగాణ ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, తేజావత రామచంద్రుడు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం మురళి మనోహర్, మాజీ ఐపీఎస్ అధికారి అరవింద్ రావు సహా పలువురు నాయకులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఎస్టీలకు ఇస్తా అన్న దళిత బంధు, బీసీలకు ఇస్తున్న బంధు ఓట్లు, సీట్ల కోసమేనని చెప్పారు. రాష్ట్రం వచ్చినప్పుడు 74 వేల కోట్ల అప్పు ఉండేదన్న ఆయన.. ఇప్పుడది 5 లక్షల కోట్లకు చేరిందని మండిపడ్డారు. ఇప్పుడే పుట్టిన పసి బిడ్డ మీద లక్షా 20 వేల అప్పు ఉందన్నారు. తనకు ఉన్న అనుభవంతో పేద ప్రజలను ఎలా బాగుచేయాలో ఆలోచన చేస్తానని తెలిపారు. టీఎస్పీఎస్సీలో 15 పేపర్లు లీక్ అయ్యాయని ఫైరయ్యారు.
విద్యా వ్యవస్థను కేసీఆర్ సర్కార్ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు ఈటల. రాష్ట్రంలో 8 వేల పాఠశాలలను మూసి వేశారని అనేక స్కూళ్లలో టీచర్లు లేరని చెప్పారు. అందరి భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని.. తొమ్మిదేండ్లుగా ప్రజలు చాలా మోసపోయారని అన్నారు. రాష్ట్రంలో ఒక్క రిక్రూట్ మెంట్ లేదని.. చైతన్యానికి కేంద్ర బిందువైన పేదల విశ్వవిద్యాలయాలను ఖతం పట్టించారని మండిపడ్డారు. వాటి స్థానంలో ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అవకాశం ఇచ్చి పేదవారికి విద్యను దూరం చేసిన చరిత్ర కేసీఆర్ దేనంటూ విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం కల్పించాలని డిమాండ్లు ఈ వేదికకు వచ్చాయన్నారు ఈటల. రాబోయే రోజుల్లో వాటిని చేసి తీరుతామని స్పష్టం చేశారు. రిక్రూట్ మెంట్ జరగాల్సింది టీచర్లకని.. కేసీఆర్ మాత్రం పోలీసు రిక్రూట్ మెంట్లను చేశారని అసహనం వ్యక్తం చేశారు. వచ్చే నెల 6న ఈ మీటింగుకు కొనసాగింపుగా ప్రజా సమస్యలపై బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు ఈటల. తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యలను పుస్తక రూపంలో తీసుకువస్తామని తెలిపారు.