కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) కు షాక్ తగిలింది. ఇరు పార్టీల అగ్రనేతలకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
ప్రధాని మోడీపై ఇరు పార్టీల అగ్రనేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం ఇరువురు నేతలకు నోటీసులు పంపింది. ‘మోడీపై వ్యాఖ్యలకు సంబంధించి మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈ నెల 16లోగా వివరణ ఇవ్వండి’అని ఆదేశించింది.
ఈ నెల 8న ఆప్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రధాని మోడీ, గౌతమ్ అదానీ ఫోటోలతో ఓ పోస్టు పెట్టింది. ప్రధాని మోడీ కేవలం వ్యాపార వేత్త గౌతమ్ అదానీ కోసం మాత్రమే పని చేస్తున్నారని, ప్రజల కోసం కాదని ట్వీట్ లో పేర్కొంది. దీంతో ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ ప్రకారం ఆప్ పై ఫిర్యాదు చేసింది.
మరోవైపు మధ్యప్రదేశ్ లో ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీఎస్‌యూ బీహెచ్ఈఎల్ సంస్థను ప్రధాని మోడీ ఆయన పారిశ్రామిక వేత్తలైన తన స్నేహితులకు అప్పగించారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు సరికాదని, ప్రధాని మోడీపై ప్రియాంక గాంధీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం స్పందించింది.