బెంగాల్(Bengal)లో సోదాలు నిర్వహించిన ఈడీ(ED)కి బెంగాల్ అధికారులు షాక్ ఇచ్చారు. ఈడీపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం సంచలనంగా మారింది. బెంగాల్లో ఈడీ వర్సెస్ తృణమూల్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఈడీ అధికారులపై నార్త్ 24 పరగణ జిల్లా సందేశ్‌కాలీ పోలీసుస్టేషన్లో మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
టీఎంసీ నేత షాజహాన్ నివాసంలో శుక్రవారం సోదాలు చేయడానికి వెళ్లిన సమయంలో ఈడీ అధికారులపై స్థానికులు దాడికి తెగబడ్డారు. దాడి చేసిన వారిలో మహిళలూ ఉన్నారు. షాజహాన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈడీ అధికారులపై కేసు నమోదు చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండానే ఈడీ అధికారులు తమ ఇంట్లోకి చొరబడ్డారని ఆరోపించారు.
అక్రమంగా చొరబడి, మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ సెక్యూరిటీతో వెళ్లినప్పటికీ ఈడీ అధికారులపై దాడి జరగడం సంచలనంగా మారింది. ఈడీ అధికారులపై దాడి చేసిన షాజహాన్ షేక్ అనుచరులు వాళ్ల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, పర్సులను ఎత్తుకెళ్లినట్లు ఆరోపించారు. ఇక్కడి పోలీసులు ఇదివరకు ఈడీ అధికారులపై కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు.
ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు ఈడీ అధికారులు ఉన్నారు. దాడిలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సోదాలు చేయడానికి వెళ్లిన సమయంలో షాజహాన్ షేక్ ఇంట్లోనే ఉన్నాడని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఫోన్ లొకేషన్‌తో పోలీసులు నిర్ధారించుకున్నారు.