సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj)కు భారీ షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసు (Money Laundering Case)కు సంబంధించి ఆయనకు ఈడీ సమన్లు పంపింది. తిరుచిరపల్లికి చెందిన జ్యుయెల్లరీ సంస్థ చేసిన రూ. 100 కోట్ల పోంజీ, ఫ్రాడ్ స్కీమ్‌కు సంబంధించి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆయన్ని ఈడీ ఆదేశించింది.
ఈ నెల 20న తిరుచిరా పల్లికి చెందిన ప్రణవ్ జ్యు వెల్లర్స్ కు చెందిన భాగస్వామ్య సంస్థపై ఈడీ దాడులు చేసింది. ఆ సమయంలో లెక్కల్లో లేని రూ. 23.70 లక్షలను ఈడీ స్వాధీనం చేసుకుంది. దాంతో కొంత బంగారాన్ని కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆ జ్యుయెల్లరీ సంస్థకు నటుడు ప్రకాశ్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.
గోల్డ్ స్కీమ్ పేరిట ప్రజలను మోసం చేసిందని ప్రణవ్ జ్యుయెల్లరీపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తమిళనాడు ఆర్థిక నేరాల పోలీసు విభాగం దర్యాప్తు మొదలు పెట్టింది. ప్రణవ్ జ్యుయెల్లర్స్ సంస్థ గోల్డ్ స్కీమ్ పేరిట అధిక లాభాల ఆశ జూపి ప్రజల నుంచి రూ. 100 కోట్ల వరకు పెట్టుబడి రూపంలో వసూలు చేసిందని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
రూ. 100 కోట్ల మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించిందని అభియోగాలు నమోదు చేశారు. ఈ క్రమంలో తమిళనాడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో వారంలోగా ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ప్రకాశ్ రాజ్ ను దర్యాప్తు సంస్థ ఆదేశించింది.