లోక్‌సభ ఎన్నికలు 2024(Lok Sabha Elections 2024)లో భాగంగా రెండవ దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఏప్రిల్ 26న(శుక్రవారం) జరగనున్న ఓటింగ్ నిర్వహణకు సిబ్బంది ఇప్పటికే ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
రెండవ విడతలో దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో కేరళ 20, కర్ణాటక 14, రాజస్థాన్ 13, ఉత్తర్ ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, వెస్ట్ బెంగాల్ 3, ఛత్తీస్ ఘడ్ 3, జమ్మూకాశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపుర 1 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
తొలి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించారు. రెండో దశ గురువారం నిర్వహించనుండగా, మూడో దశ మే 7న, నాలుగో దశ ఎన్నికల పోలింగ్ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ 1న జరుగనున్నాయి. జూన్ 4న లోక్‌సభ ఎన్నికలతోపాటే వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దశలో, ఒడిశా రాష్ట్రానికి రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్‌సభ తొలి దశ ఎన్నికలతోపాటు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. సార్వత్రిక ఎన్నికలతోపాటే తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ రాజీవ్‌కుమార్ చెప్పారు. తెలంగాణలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 412 జనరల్ స్థానాలు కాగా, 84 ఎస్సీ రిజర్వ్డ్, 47 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయని ఆయన చెప్పారు.