తెలంగాణలో అక్టోబర్-3న కేంద్ర ఎన్నికల సంఘం(central election comission) అధికారులు పర్యటించనున్నారు. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్దతను అధికారులు పర్యవేక్షిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్(vikas raj) తెలిపారు.
పర్యటనలో భాగంగా మొదటి రోజున జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు భేటీ కానున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. దీంతో పాటు ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై సంస్థలు, అధికారులతో ఈసీఐ అధికారులు భేటీ అవుతారని వికాస్ రాజ్ వెల్లడించారు.
రెండో రోజు పర్యటనలో… రాష్ట్రంలోని పోలీసు అధికారులు, ఎక్సైజ్, ఆదాయ పన్ను అధికారులు, జీఎస్టీ అధికారులతో సీఈసీ అధికారులు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు వల వేసేందుకు ఉపయోగించే డబ్బు, మద్యం,ఉచితాలను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై వారితో చర్చించనున్నారు.
ఓటర్లను ఎలా చైతన్య పరుస్తున్నారు, ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనేందుకు సంబంధించిన పలు కార్యకలాపాలపై అధికారులకు పవర్ పాయింట్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఎన్నికల్లో పాల్గొనేలా ప్రజల్లో చైతన్యం కలిగించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలువురు ప్రముఖులు, యువ ఓటర్లు, ఇతర ఓటర్లను కేంద్ర ఎన్నికలం సంఘం అధికారులు కలవనున్నారు.