టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఎక్స్(x) యూజర్లకు మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే టిక్ మార్క్‌నకు యూజర్ల నుంచి చార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కొత్తగా ఎక్స్ అకౌంట్ తీసుకునేవారు (X New Users) డబ్బు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
దీనిద్వారా స్పామ్‌ను తగ్గించడంతోపాటు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుందని చెప్పింది. కాగా, ఈ ట్వీట్‌పై మస్క్ స్పందిస్తూ ‘దురదృష్టవశాత్తూ, కొత్త యూజర్లు రైటింగ్ యాక్సెస్ కోసం చిన్నమొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బాట్‌ల దాడిని అరికట్టడానికి ఇదే ఏకైక మార్గం’ అంటూ మస్క్ పేర్కొన్నాడు.
అయితే కొత్త యూజర్లకే కాదు ట్వీట్లకు లైక్ చేయడంతోపాటు రిప్లే ఇవ్వాలన్నా చివరికి బుక్‌మార్క్ చేయడానికి కూడా చార్జ్ చేయనున్నట్లు మస్క్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌కి సంబంధించి రోజువారీ వార్తలను అందించే ఎక్స్ న్యూస్ కొత్త వినియోగదారులు నామమాత్రపు వార్షిక రుసుమును చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ విధానంలో ఇప్పటికే న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో అమలులో ఉందని తెలిపింది.
మరోవైపు భారత్‌లోని 2 లక్షల మందికిపైగా ఖాతాదారుల అకౌంట్లను ‘ఎక్స్ కార్ప్’ బ్లాక్ చేసింది. పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలత, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా మార్చి నెలలో ఏకంగా 2,12,627 ఖాతాలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది. భారతీయ వినియోగదారుల నుంచి 5,158 ఫిర్యాదులు అందాయని, తమ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ద్వారా వాటిని పరిష్కరించామని వెల్లడించింది. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 వరకు ముగిసిన నెలలో 5,06,173 మంది ఖాతాలను ఎక్స్ నిషేధించిన సంగతి తెలిసిందే.