ఏలూరు జిల్లా(Eluru District) జంగారెడ్డిగూడెం (Jaggareddy Gudem)లో విషాదం చోటు చేసుకుంది. పానీపూరీ(Panipuri) తిన్న ఇద్దరు అన్నదమ్ములు అస్వస్థతకు గురై మృతిచెందారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వెలపాటి రవి కుటుంబం నంద్యాల జిల్లా వైఎస్సార్ కాలనీ నుంచి బతుకుతెరువు నిమిత్తం ప్లాస్టిక్ వ్యాపారం చేసేందుకు జంగారెడ్డిగూడెంకు వలస వచ్చింది. రవికి ఇద్దరు కుమారులు వెలపాటి రామకృష్ణ (10), వెలపాటి విజయ్ (6) ఉన్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి బుధవారం రాత్రి బయటకు వెళ్లి పానీపూరి తిని ఇంటికి వచ్చారు.
అయితే, కొద్ది నిమిషాల్లోనూ ఇద్దరికీ కడుపునొప్పి వస్తుందని చెప్పారు. వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయల్దేరారు. అయితే మార్గమధ్యలోనే రామకృష్ణ, విజయ్ మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు.
పానీపూరీ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యి తమ బిడ్డల ప్రాణాలు పోయాయని మృతుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని రీతిలో ఇద్దరు పిల్లలు మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.