జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ (Errabelli Dayakar) కు చుక్కెదురైంది. ప్రభుత్వాస్పత్రిలో మహిళా ఆరోగ్య క్లినిక్ ప్రారంభించిన ఆయన.. మహిళలను ఉద్దేశించి మాట్లాడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. కేసీఆర్ (KCR) కిట్ పథకంపై మాట్లాడుతుండగా కిట్ డబ్బులు రావట్లేదని మంత్రిని ప్రశ్నించారు మహిళలు. వెనుకా, ముందు వస్తాయంటూ ఆయన సమాధానమిచ్చారు.
మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళలు.. డెలివరీ జరిగి మూడేళ్లు దాటినా డబ్బులు రాలేదని అన్నారు. దీంతో ఆస్పత్రి ఉద్యోగులను అడిగి సాఫ్ట్ వేర్ ప్రాబ్లం ఉంటే రావు అంటూ వ్యాఖ్యానించారు ఎర్రబెల్లి. అందరికీ వచ్చాయి.. ఒకరిద్దరికి మిస్ కావొచ్చని అన్నారు. అయితే.. తమకెవ్వరికీ రాలేదు అంటూ మహిళలు మొర పెట్టుకున్నారు. సరే, నేను మాట్లాడతా అంటూ ప్రసంగం కంటిన్యూ చేశారు మంత్రి.
మరోవైపు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎర్రబెల్లి దయాకర్ ఇంటిని ముట్టడించారు. సీఐటీయూ, టీఎమ్మార్పీఎస్, ఐఎన్టీయూసీ అధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి మంత్రి ఇంటి వరకు భారీ ర్యాలీ తీశారు.
ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పొల్గొన్నారు. తమను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులమంతా కలసి నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. దీంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఇంటి దగ్గర భారీగా మోహరించారు.