Telugu News » Etala Rajender : కుమ్మెర విషయాన్ని ప్రజా కోర్టులో పెడతాం… అక్కడే తేల్చుకుంటాం….!

Etala Rajender : కుమ్మెర విషయాన్ని ప్రజా కోర్టులో పెడతాం… అక్కడే తేల్చుకుంటాం….!

దీనికి వట్టెం రిజర్వాయర్ కింద భూములను కోల్పోయిన రైతుల దీనగాధ అని ఆయన తెలిపారు.

by Ramu

నిబంధనలను గాలికి వదిలేసి తానే రాజును, తాను చెప్పిందే వేదం అన్నట్టు కేసీఆర్ (KCR) ప్రవరిస్తున్నారని బీజేపీ (BJP) తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. దీనికి వట్టెం రిజర్వాయర్ కింద భూములను కోల్పోయిన రైతుల దీనగాధ అని ఆయన తెలిపారు. వట్టెంలో ఆత్మహత్య చేసుకున్న భూ నిర్వాసితుడు అల్లోజి కుటుంబాన్ని పరామర్శించారు.

 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వట్టెం ప్రాజెక్టు కోసం రెండు రకాలుగా భూములు సేకరించారన్నారు. ప్రాజెక్టులకు భూములు తీసుకోవడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు. కానీ భూముల సేకరణ విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ప్రజల అభ్యంతరాలను, దరఖాస్తులను, డిమాండ్ లను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

కుమ్మెర గ్రామంలో జంగయ్యకు నలుగురు కుమారులు వున్నారని చెప్పారు. వారికి 19 ఎకరాల స్థలం వుందన్నారు. అది ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే ప్రాంతం కాదన్నారు. కానీ ప్రాజెక్టు కింద క్యాంపులు వేసుకునేందుకు, ఇతర అవసరాల కోసం ఆ భూమిని తీసుకున్నారని చెప్పారు. చాలా ప్రాజెక్టుల్లో కావాల్సిన దాని కన్నా ఎక్కువ భూమి సేకరిస్తున్నారన్నారు.

ఇదే ఊరిలో హైకోర్టు ఆదేశాల ద్వారా రైతులు పది లక్షల రూపాయల నష్ట పరిహారం తెచ్చుకున్నారని పేర్కొన్నారు. దీంతో జంగయ్య కుటుంబం కూడా పది లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని కోరిందన్నారు. కానీ జంగయ్య కుటుంబానికి ఎకరాకు రెండు లక్షల నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పారన్నారు. దీనికి ఆ కుటుంబం ఒప్పుకోలేదన్నారు. ఎంత వేడుకున్నా ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదన్నారు.

ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన జంగయ్య కొడుకు మల్లేశం మూడేండ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. దీంతో ఆయన భార్యా బిడ్డలు అనాథలుగా మారారన్నారు. మల్లేశం మరణించినప్పుడైనా అధికార యంత్రాంగం, ఎమ్మెల్యేలకు స్పందించే జ్ఞానం లేకపోవడంతో మళ్లీ ఇప్పుడు అల్లోజి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.

రూపాయి కూడా ఇవ్వకుండా ఆ కుటుంబం భూమినీ క్యాంపుల పేరుతో స్వాధీనం చేసుకుని కాంపౌండ్ వాల్ పెట్టుకుని దావతులు చేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇది భరించలేని అల్లోజి 14 రోజుల క్రితం క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు అల్లోజీ మృత దేహాన్ని తీయబోమని మూడు రోజులుగా అల్లోజీ కుటుంబ సభ్యులు భీష్మించుకుని కూర్చున్నారన్నారు.

ఈ సందర్బంలో కనీసం స్పందించక పోగా శోక సంద్రంలో వున్న కుటుంబం మీద దౌర్జన్యం చేసి పోలీసులు కొట్టిన తీరు అత్యంత జుగుస్సాకరంగా వుందన్నారు.
తెలంగాణ గడ్డమీద ఎక్కడైనా ఎకరం రెండు లక్షల రూపాయలకు వస్తుందా ? అని ఆయన ప్రశ్నించారు. కుమ్మర గ్రామంలో ఎకరా 30 లక్షల రూపాయలు పలుకుతోందన్నారు. కొమ్మర గ్రామంలో జంగయ్య కుటుంబంలో చిచ్చుపెట్టి ఇద్దరు ప్రాణాలను బలి తీసుకున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ ఎమ్మెల్యేకు గరిబోళ్ల గోస పట్టదా అని ఆయన ప్రశ్నించారు.

ఇంత దుర్మార్గమైన ప్రభుత్వానికి మన వాడల్లో అడుగుపెట్టే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. మన భూమిని గుంజుకునే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. దౌర్జన్యం చేసే అధికారం వారికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. ఈ కర్కోటకులు ప్రజలను ఎంత హింసిస్తున్నారో అర్థమవుతోందన్నారు. ఇలాంటి నాయకులు మనకు అవసరమా? అని అన్నారు. కొమ్మెర విషయం ఈ గ్రామానికే పరిమితం కాదన్నారు. తెలంగాణ ప్రజా కోర్టులో దీన్ని పెడతాం అక్కడే తేల్చుకుంటామన్నారు.

You may also like

Leave a Comment