రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ (CM KCR) అవమాన పరిచారని బీజేపీ (BJP) తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. సీఎం కేసీఆర్కు బుద్ది చెప్పాలంటే ఉన్న ఏకైక మార్గం బీజేపీని గెలిపించడమేనన్నారు. బీజేపీని ఆశీర్వదించండని కోరారు. రేపటి బంగారు తెలంగాణకు బాటలు వేసే బాధ్యత బీజేపీదేనని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జన గర్జన సభలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం 24 గంటల పాటు జాతీయ రహదారులను దిగ్బంధం చేసిన వారిలో ఇక్కడికి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారని చెప్పారు. తాము చని పోయినా పర్వాలేదని కనీసం తమ తోటి వారికైనా ఉద్యోగాలు వస్తాయని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు.
ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ ఫలితాలు ఇప్పుడు కేసీఆర్, ఆయన కుటుంబం, వారి చుట్టాల అనుభవిస్తున్నారని అన్నారు. మొన్న ఆదిలాబాద్ లో ఉన్న స్వర్ణవాగు, గడ్డన్న వాగు పొంగి పక్కనున్న పొలాలు అన్ని మునిగిపోయాయన్నారు. అప్పుడు పంట నష్టపోయిన మహిళలు కార్చిన కన్నీళ్లు ఇప్పటికీ తాను మర్చిపోలేనన్నారు.
కానీ ఆ మహిళలకు సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం డబ్బులు పంచి పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 30 లక్షల మంది తెలంగాణ యువకులకు అన్యాయం చేసింది సీఎం కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. భర్తరఫ్ చేయాల్సింది టీఎస్పీఎస్సీని కాదన్నారు. భర్తరఫ్ చేయాల్సింది సీఎం కేసీఆర్ ను అని అన్నారు. కేసీఆర్ ను గద్దె దించి తేనే మనకు ఉద్యోగాలు వస్తాయన్నారు. అప్పటివరకు మనం నిద్రపోవద్దన్నారు.
రాష్ట్రం వస్తే తెలంగాణ ఆడ బిడ్డలంతా లక్షాధికారులు అవుతారని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ వడ్డీ లేని రుణాల పైసలు కూడా ఇవ్వడం లేదన్నారు. వడ్డీ లేని రుణాల కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాను టంఛన్గా మూడు నెలలకు ఒకసారి ఇస్తోందన్నారు. నాలుగేండ్లైనా కేసీఆర్ మాత్రం డబ్బులు ఇవ్వడం లేదన్నారు. బ్యాంకుల్లో మహిళా సంఘాల గ్రూపులు డిఫాల్టర్ గా మిగిలిపోతున్నారని వెల్లడించారు.
ధనిక రాష్ట్రం, రైతుల కోసం పుట్టిన, రైతుల కోసం పనిచేస్తున్నా నని చెబుతూ నాలుగున్నరేండ్లు గడిచినా రైతులకు రుణమాఫీ డబ్బులు విడుదల చేయలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. రూ. 7800 కోట్లకు రింగ్ రోడ్డును అమ్మి, మద్యం టెండర్లు వేసి, భూములను కుదువ పెట్టి డబ్బులు తెచ్చి రైతులకు రుణమాఫీ డబ్బులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లేని రుణాల పైసలు చెల్లించే జిమ్మేదార్ తనదన్నారు. వీవోఏలకు 5 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. బీజేపీ వస్తే వాళ్లకు అండగా ఉంటామన్నారు. సకాలంలో పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. రైతు బంధు పూర్తి చేయలేదన్నారు. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందన్నారు. దీని నుంచి బయట పడాలంటే.. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ సర్కార్ ను బొంద పెట్టాలన్నారు.