బీజేపీ (BJP) నేత ఈటల రాజేందర్ (Etela Rajender) పార్టీ మారతారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోబీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు పార్టీని విడిచి వెళ్లిపోతానా ఎదురు చేసేవాళ్లు చాలా మంది ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారడం లేదని మరోసారి స్పష్టం చేశారు.
పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని తాను గతంలో చెప్పానని గుర్తు చేశారు. తన లాంటి నాయకులు పార్టీలు మారితే ప్రజలు క్షమించరని వెల్లడించారు. తాను పార్టీ మారతానంటూ కొంత మంది ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఓ వైపు ఈటల ఘర్ వాపసీ అంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే, బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరతారంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు ఓట్ల కోసం బీఆర్ఎస్తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ అధికారంలో ఉండగా ప్రధాని మోడీ, అమిత్ షా పై ఎంత అహంకారంతో మాట్లాడారో ఇప్పటికీ తమ కళ్లముందు కదులాడుతోందని పేర్కొన్నారు.
ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన తర్వాత పొత్తులు అంటే ప్రజలు నవ్వుకుంటారని వెల్లడించారు. ఈటల పార్టీ మారుతున్నారంటూ ఇటీవల వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన టీ కాంగ్రెస్ నేతలతో ఓ ఫంక్షన్లో భేటీ అయ్యారు.దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన పార్టీ మారుతున్నారని అంతా చర్చించుకుంటున్నారు.