భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భుజాలపై మోస్తున్న వ్యక్తి కిషన్‌రెడ్డి(Kishan Reddy)అని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etela Rajender)అన్నారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎంపీ లక్షణ్, ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఐదో స్థానానికి రావడం నరేంద్ర మోడీ కృషికి నిదర్శనమని అన్నారు. ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే భారత్ ప్రపంచంలోనే మూడో స్థానానికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో భారతదేశాన్ని పట్టించుకునే వారు లేరన్నారు.
నేడు ప్రపంచం మొత్తం మోడీ వైపు చూస్తోందని తెలిపారు. దేశాల మధ్య యుద్ధాల నివారణకు కూడా మన మోడీని ఆశ్రయించడం మన భారతీయులందరికీ గర్వకారణమని తెలిపారు. అదేవిధంగా కిషన్‌రెడ్డికి మతం, కులం, రంగు లేదని, ఆయనకు మనుషులు మాత్రమే తెలుసని అన్నారు. 2004 నుంచి 2014 వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుండా తాను, కిషన్ రెడ్డి గెలిచామని గుర్తుచేసుకున్నారు.
2019లో ఆయన ఓడిపోయారని, తాను మొన్న ఓడిపోయానని చెప్పారు. ఇద్దరమూ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నామని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి వచ్చి ప్రజా సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేవాడని ఈటల తెలిపారు. కిషన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.