రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల పరిస్థితి చూస్తుంటే ఏడుపొస్తోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Ex Minister Niranjan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో ఇవాళ(సోమవారం) ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పుడొచ్చిన కరువు కాంగ్రెస్ తెచ్చిందేనని ఆరోపించారు. ఎక్కడ చూసినా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు.
ప్రస్తుతం పంటలు ఎండిపోయి పశువులను వదిలే పరిస్థితి నెలకొందని, ఇప్పుడు రైతులు వాళ్ల చెప్పులతో వాళ్లే కొట్టుకున్నట్లు అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతుల సమస్యలను పట్టించుకోకుండా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ విమర్శలకే పరిమితమవుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇస్తామన్న రైతు బంధు రూ.15వేలు, బోనస్ రూ.500 హామీ ఏమైందన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మాటలు హాస్యస్పదంగా ఉన్నాయని.. కరువు సీమగా ఉన్నా తెలంగాణలో నీళ్ళు పారించి, పచ్చదనం, ప్రశాంతత కల్పించింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు.
ప్రభుత్వ పెద్దల మెప్పును పొందేందుకే ఆయన అలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. తుమ్మలదీ రైతు కుటుంబమేనని గుర్తుంచుకోవాలన్నారు. యాసంగి సాగులో నష్టపోయిన రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని హరీశ్‌రావుతో పాటు తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని గుర్తుచేశారు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకుందని అసహనం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, దక్షణ తెలంగాణలో సగటు కంటే తక్కువ నమోదు అయిందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఇప్పటికీ 3 నుంచి 4టీఎంసీల నీళ్లు ఉన్నా ఇంత వరకు ప్రభుత్వ పెద్దలు ప్రాజెక్టు దగ్గరికీ వెళ్లకపోవడం సిగ్గుచేటన్నారు. గోదావరి నీళ్లు ఎలా వాడుకోవాలో చెప్పినా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు పరిహారం ఇచ్చేంత వరకూ వారి పక్షాన పోరాడుతామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కరువును పారదోలడానికని గుర్తుచేశారు. సేద్యానికి ఊపిరి పోసిందెవరో.. ఉసురు పోసిందెవరో రైతులు గమనించాలన్నారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాశేత్రంలో బుద్ది చెప్పండని విజ్ఞప్తి చేశారు.