జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)చోటుచేసుకుంది. జమ్మిచేడు ప్రాంతంలో కారు (Car) అదుపు తప్పి డివైడర్(Divider)ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటన వివరాల్లోకి వెళితే… గద్వాల పట్టణానికి చెందిన ఓ వైద్యుడి కుమార్తె పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఆ వేడుకలకు హాజరై ఎర్రవల్లికి వెళుతున్న సమయంలో కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వైద్యులు అక్కడికక్కడే మరణించారు.
మృతులను నరేశ్ (23) మల్దకల్, పవన్ కుమార్ (28) పెబ్బేరు, ఆంజనేయులు (50) గద్వాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా గద్వాలలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రమాదంలో గాయపడిన గోవర్ధన్(20)-మైలగడ్డ, నవీన్(20)-పాల్వాయి,మహబూబ్(23)-గద్వాలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక మృతుల్లో నరేశ్, పవన్ వారి కుటుంబాల్లో ఏకైక సంతానం. దీంతో ఒక్క కుమారున్ని కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు.