పెళ్లైన కూతురు చిన్న గొడవ పెట్టుకుని అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చిందంటేనే తల్లి దండ్రులు (Parents) కంగారు పడిపోతారు. అలాంటిది పూర్తిగా అత్తింటితో బంధాన్ని తెంచుకుని వస్తున్నానని చెబితే ఆ తల్లి దండ్రులు బాధ ఎలా వుంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ జార్ఖండ్ (Jarkhand) లో ఓ తండ్రి మాత్రం అలా చేయలేదు. తన కూతరిని ఊరేగింపుగా తన ఇంటికి తీసుకు వచ్చాడు. పెళ్లిలో చేసినట్టుగానే టపాసులు పేలుస్తూ ఊరేగింపుతో తన కూతురిని ఇంటికి తీసుకు వచ్చాడు.
ఇంతకు ఏం జరిగిందంటే.. రాంచీలోని కైలాశ్ నగర్ లోని కుమ్హర్టోలి ప్రాంతంలో ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి నివసిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ 28న సర్వేశ్వరి నగర్ కు చెందిన సచిన్ కుమార్ అనే వ్యక్తితో తన కూతురు సాక్షి గుప్తాకు వివాహం చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్ గా సచిన్ పని చేస్తున్నారు.
మొదట్లో కొన్ని రోజులు పాటు సాక్షితో సచిన్ బాగానే ఉండే వాడని ప్రేమ్ గుప్తా తెలిపారు. ఆ తర్వాత ఏం జరగిందో తెలియదు కానీ నెమ్మదిగా తన కూతుర్ని సచిన్ తరుచూ వేధించడం మొదలు పెట్టాడన్నారు. పలు మార్లు ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడన్నారు. ఇటీవల సచిన్ గురించి మరో విషయం తన కుమార్తెకు తెలిసిందన్నారు. అతనికి ఇది వరకే వివాహం అయిందని, తాను రెండవ భార్యనని తన కుమార్తెకు అర్థమైందన్నారు.
అసలు విషయం తెలిసినప్పిటికీ సచిన్‌తో కలిసి వుండాలని తను కుమార్తె నిశ్చయించుకుందన్నారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్ది సచిన్ వేధింపులు పెరిగాయే తప్ప తగ్గలేదన్నారు. దీంతో తను కూతురు విసుగు చెంది సచిన్‌తో బంధాన్ని తెంచేసుకుని రావాలనుకుంటున్నట్టు చెప్పిందన్నారు. దీంతో తన కూతుర్ని ఇంటికి రావాలని చెప్పానన్నారు.
తన కూతురుకు అత్తింటి వేధింపుల నుంచి విముక్తి లభించిందన్నారు. ఇది సంతోషించాల్సిన విషయమని చెప్పారు. అందుకే సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నట్టు వెల్లడించారు. అందుకే బాజా భజంత్రీలు, టపాసులతో తన కుమార్తెను ఇంటికి తీసుకు వచ్చానన్నారు. కూతురు అంటే తండ్రికి భారం కాదని, వాళ్లు అత్తింట్లో ఇబ్బందులు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకు రావాలన్నారు. ప్రస్తుతం వారి విడాకులపై కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. త్వరలోనే వారికి విడాకులు మంజూరు అవుతాయని అంటున్నారు.