రాష్ట్ర విభజనకు చంద్రబాబే ప్రధాన కారకుడని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Minister Rajendranath Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్(CM Jagan) ఏపీని అప్పుల కుప్పగా మార్చారని విపక్షాలు చేస్తున్న కామెంట్లకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 2008లో తెలంగాణ ఏర్పాటుకు లేఖ రాసిన చంద్రబాబు వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపించారు.
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఓపీఎస్ కేంద్రం వెనక్కి వెళ్లిందన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉండటానికి ప్రధాన కారణం చంద్రబాబేనన్నారు. లక్షల కోట్లు అప్పు చేశామంటున్న టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్థిక మంత్రి చంద్రబాబు ఏ ఆధారంతో ఈ లెక్కలు చెబుతున్నారని ప్రశ్నించారు.
కొవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా మారిన విషయం వాస్తవమన్నారు. కానీ, పెండింగ్ బిల్స్ 1,90 వేల కోట్లు ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు? అంటూ మంత్రి బుగ్గన ప్రశ్నించారు. ఆర్బీఐ విడుదల చేసిన డాక్యుమెంట్లో 15 ఏళ్ల డేటా ఉంటుందని, టీడీపీ హయాంలో వార్షిక అప్పు 22 శాతం ఉంటే.. తమ ప్రభుత్వంలో 12 శాతమే అన్నారు. ఆర్బీఐ, ఆర్థిక శాఖ, బ్యాంకులకు తెలియకుండా అప్పులు చేయటం సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు.
స్థూల ఉత్పత్తిపై టీడీపీ హయాంలో అప్పు 2,59,000 కోట్లు.. అంటే 7శాతం నిష్పత్తితో తమ ప్రభుత్వంలో స్థూల ఉత్పత్తిలో 2,26,000 కోట్ల అప్పు, నిష్పత్తిలో 5.6 శాతమేనని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం స్థూల ఉత్పత్తి 10,84,000 కోట్లని, టీడీపీ హయాంలో స్థూల ఉత్పత్తి 6,98,000 కోట్లని వివరించారు.
అదేవిధంగా 2022-23లో పీఎఫ్ ఖాతాలు పెరిగితే ఉద్యోగాలు పెరిగినట్లు కాదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నాడు చంద్రబాబు.. ఆయన వయసుకు ఇలా పేర్లు పెట్టడం పద్ధతి కాదన్నారు. లోకేశ్‌ను రేలంగి అని అనలేమా? అంటూ సెటైర్లు విసిరారు. తమకు సంస్కారం ఉందిగనకే అలాంటి వ్యాఖ్యలు చేయడంలేదన్నారు.