హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ (Hyderabad Metro Corporation) కు రూ. 10 వేలు జరిమానా కట్టాలని ఆదేశించింది వినియోగదారుల కమిషన్ (Consumer Commission). మెట్రో స్టేషనులో రూ. 10 అదనంగా వసూలు చేశారన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఈ మేరకు జరిమానా (Fine) విధించింది. అలాగే అదనంగా వసూలు చేసిన రూ. 10ని వాపసు ఇవ్వాలని మెట్రో సంస్థను ఆదేశించింది.
కేసు వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన లాయర్ వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ ఎల్బీనగర్ మెట్రో రైల్వే స్టేషన్‌లో 2019, జనవరి 18న ప్రయాణించారు. మెట్రో రైలు ఎక్కే తూర్పు దారిలో టాయిలెట్లు లేకపోవడంతో పడమరవైపు ఉన్న వేరే దారిలో వెళ్లారు.
దీని కోసం మెట్రో రైల్వే సంస్థ జారీ చేసిన ట్రావెల్ కార్డును ఆయన స్వైప్ చేశారు. దీనికి రూ. 10 ట్రావెల్ కార్డు నుంచి కట్ అయ్యాయి. ప్రయాణం చేయకుండా డబ్బులు ఎలా కట్ చేస్తారని మెట్రో సిబ్బందిని ప్రశ్నించారు. దానికి మెట్రో సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు.
దీనిపై ఖమ్మంలోని వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. ఇరువైపులా మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంతో తన వద్ద రూ. 10 అదనంగా వసూలు చేసి, మెట్రో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రూ.5 వేలు, కోర్టు ఖర్చు మరో రూ.5 వేలు 45 రోజుల్లోగా కట్టాలని, అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం డిస్ ప్లే బోర్డులు పెట్టాలని మెట్రో సంస్థను ఆదేశించింది.