హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. రాజేందర్ నగర్ లోని గగన్ పహాడ్ (Gagan Pahad) ప్రాంతంలోని థర్మాకోల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. దట్ట మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో కార్మికులు, స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
పక్కనే ఆయిల్ ఫ్యాక్టరీ కూడా ఉంది. దీంతో మంటలు ఆయిల్ ఫ్యాకర్టీకి వ్యాపించే ప్రమాదం ఉందటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
థర్మకోల్ కంపెనీ నుంచి దట్టమైన పొగ రావడంతో మంటలను ఆర్పడం అగ్నిమాపక సిబ్బంది కష్టంగా మారింది. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
సుమారు రూ. కోటి నుంచి రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో కంపెనీ యాజమాని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరంలో నల్లని పొగ వ్యాపించింది.. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఏం జరిగిందోనని కంగారు పడుతున్నారు.