ఓ పాఠశాల వసతి గృహంలో చెలరేగిన మంటలు 13 మంది ప్రాణాలు బలిగొన్న సంఘటన చైనా (China)లో చోటు చేసుకొంది. ప్రమాదం సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈమేరకు అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన హెనాన్ ప్రావిన్స్ (Henan Province)లో యన్షాన్పు గ్రామంలో జరిగింది.
స్థానిక వార్తా సంస్థల కథనాల ప్రకారం నిన్న రాత్రి 11 గంటల సమయంలో పాఠశాల వసతి గృహంలో అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. సమాచారం అందుకొన్న అగ్నిమాపక దళాలు రంగంలోకి మంటలను పూర్తిగా ఆర్పేశాయని చైనా మీడియా వెల్లడించింది. కాగా ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు తెలిపారు. ప్రస్తుతం గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
మరోవైపు అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.. ఇందులో భాగంగా.. ఒకరిని అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం.. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోల్లో ముఖాలకు మాస్క్ ధరించి ఉన్న పిల్లలు కిండర్‌గార్డెన్ పిల్లలని భావిస్తున్నారు. వీరితో కాలీగ్రఫీ నేర్చుకొనే విద్యార్థులు సైతం ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా చైనాలో తరచుగా అగ్నిప్రమాదాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.
సేఫ్టీ నిబంధనలు సరిగా లేకపోవడం, ఉన్న నిబంధనలను అమలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కారణాల వల్ల జరుగుతోన్న అగ్నిప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గతేడాది నవంబర్‌లో షాన్షీ ప్రావిన్స్‌లోని ఓ బొగ్గు గని కంపెనీ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదంలో 26 మంది చనిపోయారు. జూన్‌లో ఓ రెస్టారెంట్లో పేలుడు సంభవించగా 31 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఈ ప్రమాదాలపై చైనాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.