రంగారెడ్డి జిల్లా(Rangareddy District) రాజేంద్రనగర్(Rajendranagar)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీ(MM Pahadee)లోని కట్టెల గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు పరుగులు తీశారు. మంటలతో పాటు దట్టమైన పొగ కాలనీ అంతా వ్యాపించడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు.
సోఫా తయారు చేసే ఓ షాప్‌నకు మంటలు అంటుకున్నాయి. రెండు గోదాంలో మంటలు చెలరేగడంతో పరిశ్రమలో ఉన్న మూడు బైక్‌లు దగ్ధమయ్యాయి. అయితే, ప్రమాదం రాత్రివేళలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పరిశ్రమలో ఎవ్వరూ లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో గ్యాస్ సిలిండర్లు పట్టుకొని బయటకు వచ్చారు. అనంతరం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడు ఫైరింజన్లతో రంగంలోకి దిగారు.
అగ్నిమాపక సిబ్బంది ఐదు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.