నాంపల్లి(Nampally) బజార్ ఘాట్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం(Fire Accident)లో తొమ్మిది మంది మృతిచెందిన విషయం విధితమే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే క్లూస్ టీం(Clues Team) భవనంలో పలు ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ, సెట్ బ్యాక్ లేదని ఫైర్ అధికారులు తేల్చారు. పార్కింగ్ కోసం వినియోగించాల్సిన సెల్లార్లో కెమికల్స్ స్టోర్ చేశారని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. పాలిస్టర్ రెసిన్, బ్యానర్స్‌కు వాడే సామగ్రి, ప్లాస్టిక్ మెటీరియల్, కెమికల్స్‌ను రమేష్ జైస్వాల్ స్టోర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయాలపాలైన బిల్డింగ్ ఓనర్ లక్డీకపూల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. రమేష్ కోలుకోగానే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నేడు భవనాన్ని జేఎన్టీయూ ఇంజనీర్ బృందం పరిశీలించనుంది. తలా అనే యువకుడు 90 శాతం గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తలాతో పాటు మరో ఏడుగురికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 21 మందిని అగ్ని ప్రమాదంలో కాపాడారు. అగ్ని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఫైర్ శాఖ అధికారులు చెబుతున్నారు.
బిల్డింగ్‌లో మొత్తం 16 ఇళ్లు ఉన్నాయి. బిల్డింగ్‌కి ఎలాంటి సెట్ బ్యాక్ లేదు.. బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ అసలే లేదు. భారీగా కెమికల్ నిల్వలు ఉంచినప్పుడు తమకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అపార్ట్మెంట్ వాసులను అగ్నిమాపక శాఖ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు తనిఖీలు చేపట్టని విజిలెన్స్ అధికారులు, సేఫ్టీ పరిశీలనలో విఫలమైన జీహెచ్ఎంసీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.