మహారాష్ట్ర (Maharastra )లో అస్తి నుంచి అహ్మద్ నగర్ (Ahmed Nagar) వెళ్తున్న రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణ్ దోహ్-అహ్మద్ నగర్ సెక్షన్ మధ్య మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
మంటలు వ్యాపించడం గమనించి ప్రయాణికులను కిందకు దించి వేశామన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం (NO Casualities) జరగలేదని అధికారులు వెల్లడించారు. మొత్తం 8 కోచ్ లకు మంటలు అంటుకున్నట్టు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన కోచ్ ల్లో ఎవరూ చిక్కుకో లేదన్నారు.
వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించామన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చిందని అధికారులు తెలిపారు. మొదట గార్డ్ సైడ్ బ్రేక్ వ్యాన్‌లో మంటలు చెలరేగాయని చెప్పారు.
వెంటనే ఆ పక్కనే ఉన్న నాలుగు కోచ్‌లకు మంటలు వ్యాపించాయన్నారు. మంటలు మరింత వ్యాపించక ముందే ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించామన్నారు. రెస్క్యూ బృందాలకు సహాయం అందించేందుకు యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ (ఏఆర్టీని) ఘటనా స్థలానికి రైల్వే అధికారులు పంపించారు.