మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన భోళా శంకర్ మూవీ శుక్రవారం విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. మెగా ఫ్యాన్స్ (Mega Fans) రచ్చ రచ్చ చేస్తున్నారు. బాస్ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా, రెండోరోజు కూడా థియేటర్ల దగ్గర హడావుడి కనిపిస్తోంది. కానీ, ఒక చోట మాత్రం ఫాన్స్ సందడి కాకుండా.. ఫైరింజన్ల హడావుడి నెలకొంది.
హైదరాబాద్ (Hyderabad) లోని చందానగర్ (Chanda Nagar) పరిధిలో జాతీయ రహదారికి అనుకొని టపాడియా (Tapadia) షాపింగ్ మాల్ ను ఈమధ్యే ఓపెన్ చేశారు. ఇందులో ఐదో అంతస్తులో జేపీ సినిమాస్ (JP Cinemas) ఉంది. ప్రస్తుతం ఈ థియేటర్ లో బోళాశంకర్ (Bhola Shankar) ఆడుతోంది. ఫ్యాన్స్ ముందస్తు టికెట్లు కూడా తీసుకున్నారు. ఇంకొన్ని గంటల్లో మూవీ చూద్దాం అనుకున్న వారికి షాక్ తగిలింది. భవనం మంటల్లో చిక్కుకుంది.
ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. దీంతో ఐదు స్క్రీన్లతోపాటు ఫర్నీచర్ కాలిపోయాయి. స్కై లిఫ్టర్, నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఘటనాస్థలానికి చేరుకున్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు. షాపింగ్ మాల్ కు ఫైర్ ఎన్ఓసీ లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అనుమతులు లేకుండానే జేపీ సినిమాస్ యాజమాన్యం సినిమాలు నడిపిస్తోందని తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఉదయం కాబట్టి సరిపోయింది.. అదే జనం ఉన్నప్పుడు ప్రమాదం జరిగి ఉంటే పెద్ద ఘోరమే చూడాల్సి వచ్చేది.