ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్(online shopping)పై మక్కువ చూపుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు(cyber criminals) ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లపై కన్నేశారు. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ సేల్ నడుస్తోంది. ఈ క్రమంలో యూపీ(UP)లోని బస్తీలో ఓ యువకుడు ఆన్‌లైన్ కేటుగాళ్ల వలలో పడ్డాడు.
నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహరిపూర్‌లో నివాసముంటున్న మనోజ్ సింగ్ పెద్ద కొడుకు కోసం రూ.76,914 విలువైన ల్యాప్‌టాప్ బుక్ చేశాడు. అనుకున్న సమయానికే డెలీవరీ వచ్చింది. మనోజ్ సింగ్ ఆ ప్యాక్‌ను తెరిచి చూసి కంగుతిన్నాడు. ఆ పెట్టెలో ల్యాప్‌టాప్‌కు బదులుగా రాళ్లు కట్టిన మూటలు దర్శనమిచ్చాయి.
ఆ మూటలను చూసి అంతా షాక్‌కు గురయ్యారు. తాను అక్టోబరు 7న ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశానని మనోజ్ సింగ్ చెప్పాడు. ధర సుమారు రూ.1లక్ష 3వేలు కాగా ఆర్డర్ చేసే సమయంలో రూ.76914 చెల్లించినట్లు బాధితుడు తెలిపాడు.
అయితే ఆర్డర్‌ను వెనక్కి పంపి రద్దు చేయాలని ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యాన్ని కోరాడు. అయినా కంపెనీ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని మనోజ్ సింగ్ తెలిపాడు. దసరా పండుగకు సెలవులు కావడంతో ఇంటికి వస్తున్న తన కొడుక్కి బహుమతిగా ల్యాప్‌టాప్ ఇద్దామంటే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.