మిచాంగ్ తుఫాన్(Michaung cyclone) ప్రభావంతో ఏపీ(AP)లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. కాలనీలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వరదనీటితో నిండిపోయాయి. జనజీవనం స్తంభించింది. తుపాను నెల్లూరు వద్ద కేంద్రీకృతమై తదుపరి తూర్పు దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాలకు నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్లో భారీగా వరదనీరు చేరింది. దీంతో అధికారులు మోటార్లు పెట్టి మరీ నీటిని తోడుతున్నారు. నెల్లూరు తూర్పు, పడమర భాగాలను కలిపే ఈ బస్టాండ్లో కాలువలు ఉప్పొంగడంతో భారీగా వరదనీరు వచ్చి చేరింది. రామలింగాపురం, మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జిలలోకి భారీగా వరద నీరు చేరింది.
ప్రత్తిపాడులో పొగాకు, మొక్కజొన్న, శనగ పంటలు నీట మునిగాయి. నరసరావుపేట ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. వర్షం కారణంగా పలు జిల్లాలో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. మాగుంట సుబ్బరామిరెడ్డి సర్కిల్ నుంచి బెజవాడ గోపాల్ రెడ్డి సర్కిల్ వరకు వరద నీరు చేరింది. దీంతో మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద రాకపోకలను నిలిపివేశారు.
వరద నీరు అధికంగా చేరుతుండటంతో సమీపంలోని అపార్ట్మెంట్లలోని సెల్లర్లలోకి నీరు చేరుతోంది. మరోవైపు పల్నాడు ప్రాంతం నరసరావుపేట, ప్రత్తిపాడు, సత్తెనపల్లి ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. తుఫాన్ వస్తుందని ముందుగానే తెలిసినా.. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.